Tamilnadu: పెరుగుతున్న కరోనా కేసులు... తమిళనాడు కీలక నిర్ణయం!
- తమిళనాడులో రెండో వేవ్
- ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరిలకు మినహాయింపు
- ఈ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామన్న అధికారులు
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమై, రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరు తమ రాష్ట్రానికి వచ్చినా ముందుగా ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం తప్పనిసరని ప్రకటించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కేరళ సహా దేశంలోని ఇంకే ప్రాంతం నుంచి వచ్చే వారైనా, విదేశాల నుంచి వచ్చే వారైనా ఈ-పాస్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది.
వేరే ప్రాంతాల నుంచి వస్తున్న వారి కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారు ముందుగానే కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ను జత పరుస్తూ, అనుమతి తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.