Passenger: నాకు కరోనా పాజిటివ్... టేకాఫ్ కు కొద్దిముందుగా చెప్పిన విమాన ప్రయాణికుడు
- ఢిల్లీ నుంచి పూణే వెళుతున్న విమానం
- టేకాఫ్ తీసుకుంటుండగా ఘటన
- తనకు కరోనా సోకిందని సిబ్బందికి చెప్పిన వ్యక్తి
- మెడికల్ రిపోర్టులు చూపించిన వైనం
- టేకాఫ్ విరమించుకున్న పైలెట్
పదిమంది ఉన్న చోట ఎవరైనా గట్టిగా తుమ్మితేనే హడలిపోయే పరిస్థితుల్లో, ఓ విమానంలో ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్ అని వెల్లడిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! ఢిల్లీ నుంచి ప్రయాణికులతో టేకాఫ్ తీసుకుంటున్న ఓ ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు తనకు కరోనా ఉందని బాంబు పేల్చాడు! దాంతో ఆ విమాన పైలెట్ టేకాఫ్ విరమించుకుని విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఇండిగో విమానం 6ఈ-286 పూణే బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది.
ప్రయాణికుల్లోంచి ఓ వ్యక్తి లేచి తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా చూపించాడు. ఈ నేపథ్యంలో, విమాన పైలెట్ ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు నివేదించాడు. వారి సూచనల మేరకు విమానాన్ని కిందికి దించాడు. ఆ కరోనా రోగిని ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రయాణికుడు కూర్చున్న సీటుతో పాటు ఇతర సీట్లను కూడా శుద్ధి చేసిన తర్వాతే ఆ విమానం పూణే వెళ్లనుంది. ప్రయాణికులందరికీ పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు.