Gadwala Vijayalaxmi: మరో వివాదంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి!
- రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
- నిబంధనలకు విరుద్ధంగా తన చాంబర్లో ప్రచారం
- తనను కలిసేందుకు వచ్చిన వారికి కరపత్రాల పంపిణీ
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పీవీ కుమార్తె వాణీదేవిని గెలిపించాలని కోరుతూ మేయర్ గద్వాల విజయలక్ష్మి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వివాదం రాజుకుంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మేయర్ తన చాంబర్లో ప్రచారం నిర్వహించడమేంటంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తన చాంబర్లోనే ప్రచారానికి దిగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయలక్ష్మిపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నాయి. కాగా, ఈ వివాదంపై మేయర్ విజయలక్ష్మి ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, హైదరాబాద్‌లో మరో ఐదేళ్లపాటు వర్షాలు కురవకూడదని కోరుకుంటున్నట్టు చెప్పిన విజయలక్ష్మి ఇటీవల ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే.