Cyber Crime: హైదరాబాద్ మహిళా డ్యాన్సర్ నుంచి రూ. 11.75 లక్షలు నొక్కేసిన కేటుగాడు!
- మ్యాట్రిమోనియల్ సైట్ లో డ్యాన్సర్ ప్రొఫైల్
- బీఎండబ్ల్యూలో పని చేస్తున్నానని పరిచయం చేసుకున్న కేటుగాడు
- కేసును విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా డ్యాన్సర్, సైబర్ కేటుగాడి చేతిలో దారుణంగా మోసపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంటూ, డ్యాన్సర్ గా జీవనం సాగిస్తున్న ఓ యువతి, ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో తన ప్రొఫైల్ ను అప్ లోడ్ చేసింది.
ఆపై ఆమెకు తాను ఎన్నారైని అంటూ, లండన్ లోని బీఎండబ్ల్యూ కార్ల సంస్థలో సూపర్ వైజర్ నంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. పలుమార్లు మాట్లాడుకున్న తరువాత, అతన్ని వివాహం చేసుకునేందుకు ఆమె అంగీకరించింది. తాను ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడతానని కూడా అతను నమ్మబలికాడు.
ఓ రోజు తమ ప్రేమకు కానుకగా, ఆశ్చర్యపరిచే బహుమతిని పంపుతున్నానని, డాలర్లు, ల్యాప్ టాప్, గోల్డ్ ఆర్నమెంట్స్ వస్తున్నాయని చెప్పిన అతను, వాటి చిత్రాలను వాట్సాప్ లో షేర్ చేశాడు. దీన్ని ఆమె నమ్మింది. ఆపై రెండో రోజునే మరో వ్యక్తి ఫోన్ చేసి, తాము ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. దాన్ని పంపాలంటే, కొన్ని సుంకాలు చెల్లించాలని చెప్పి, పలు విడతలుగా రూ. 11.75 లక్షలు కట్టించుకున్నారు.
పలు ఖాతాల్లో వారు డబ్బు వేయించుకోవడం, తనకు పార్శిల్ రాకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె డబ్బులు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా కేసును విచారిస్తున్నారు.