Taj Mahal: తాజ్ మహల్‌లో బాంబు పెట్టానని ఫోన్ చేసి కలకలం రేపిన వ్యక్తి!
- తనకు సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదని చెప్పిన వ్యక్తి
- అందుకే బాంబు పెట్టినట్లు ఫోనులో చెప్పిన దుండగుడు
- పర్యాటకులను ఖాళీ చేయించి తనిఖీ చేసిన పోలీసులు
- పేలుడు పదార్థాలు ఏవీ లేవని గుర్తింపు
తాజ్ మహల్‌లో బాంబు పెట్టానని ఫోన్ చేసి కలకలం రేపాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. తనకు సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదన్న ఆగ్రహంతో బాంబు పెట్టానని అతను పోలీసులకు చెప్పాడు. సైనిక నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకే తనను తీసుకోలేదని అన్నాడు. తాను పెట్టిన బాంబు త్వరలోనే పేలుతుందని చెప్పాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పర్యాటకులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. తాజ్ మహల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశామని, తాజ్‌మహల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఆగ్రా పోలీసులు తెలిపారు.
ఎవరో బెదిరింపు కాల్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్ ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ బెదిరింపు కాల్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.