COVAXIN: కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్
- కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
- దేశీయ వ్యాక్సిన్ గా గుర్తింపు
- భారత్ లో అత్యవసర వినియోగం
- అదే సమయంలో మూడో దశ క్లినికల్ పరీక్షలు
- 81 శాతం సామర్థ్యం చూపినట్టు భారత్ బయోటెక్ వెల్లడి
దేశీయంగా అభివృద్ధి పరిచిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను ఓవైపు వినియోగిస్తుండగానే, మరోవైపు మూడో దశ క్లినికల్ పరీక్షలను కూడా నిర్వహించారు. తాజాగా ఈ మూడో దశ ప్రయోగ ఫలితాలను కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ వెల్లడించింది.
ఈ దశలో 25,800 మంది వలంటీర్లపై పరీక్షలు జరిపామని వివరించింది. ఐసీఎంఆర్ సహకారంతో నిర్వహించిన ఈ మూడో దశ దేశంలోనే అతిపెద్ద క్లినికల్ పరీక్షల ప్రక్రియ అని పేర్కొంది. ఈ దశలో కొవాగ్జిన్ క్లినికల్ సామర్థ్యం 81 శాతం అని సంస్థ తెలిపింది.
మునుపటి దశలతో పోల్చితే ఈ దశలో ఫలితాలు మెరుగయ్యాయని వివరించింది. తుది విశ్లేషణ నిమిత్తం క్లినికల్ ట్రయల్స్ ను కొనసాగిస్తామని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.