Cow Dung: చత్తీస్‌గఢ్‌లో పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. ఐదుగురు మహిళల నుంచి 45 కేజీల పేడ స్వాధీనం!
- గతేడాది గౌ-దాన్ న్యాయ యోచన పథకం ప్రారంభం
- కిలో ఆవుపేడకు రెండు రూపాయల చెల్లింపు
- గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు!
పేడ దొంగతనాలేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా ఇది నిజం! పేడను దొంగతనం చేస్తూ దొరికిన ఐదుగురు మహిళల నుంచి పోలీసులు ఏకంగా 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది.
పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వ గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు.