Chandrababu: ఇంకా భోజనం కూడా చేయని చంద్రబాబు.. విమానాశ్రయానికి చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు
- విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
- విమానాశ్రయంలో నిరసనగా బైఠాయించిన బాబు
- ఎయిర్ పోర్టుకు చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ
రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. నేల మీద బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటలకు పైగా నేల మీదే కూర్చోవడంతో ఆయన కాళ్ల నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన భోజనం చేయడానికి కూడా నిరాకరించారు. తనను విమానాశ్రయం నుంచి బయటకు పంపించేంత వరకు తాను నేల మీదే కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు విమానాశ్రయానికి తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు, ఆర్డీవో కనకనరసారెడ్డి చేరుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
మరోవైపు కాసేపటి క్రితం ఎస్పీ అప్పలనాయుడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నిన్న రాత్రి 11 గంటల తర్వాత టీడీపీ నేతలు పోలీసుల అనుమతిని కోరారని చెప్పారు. అనుమతి లేఖలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న విషయానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని అన్నారు. చంద్రబాబు నిరసన చేపట్టాలనుకున్న ప్రాంతం తిరుపతిలో అత్యంత కీలకమైనదని చెప్పారు.
భక్తులు వచ్చే ప్రదేశంలో దీక్షకు అనుమతిని ఇవ్వలేమని అన్నారు. కరోనా నిబంధనలు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు తిరుగు ప్రయాణానికి తాము ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అన్నారు.