Yousuf Pathan: యూసుఫ్ పఠాన్ ఘనతలను గుర్తు చేసిన ఐసీసీ!
- నిన్న రిటైర్ మెంట్ ప్రకటించిన యూసుఫ్
- 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో మెంబరన్న ఐసీసీ
- అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పందన
భారత క్రికెట్ జట్టులో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సత్తా చాటి, ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్, తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పగా, ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) అతని ఘనతలను గుర్తు చేసుకుంది. యూసుఫ్ ఎన్నో ట్రోఫీలను భారత్ కు అందించిన క్రికెట్ టీమ్ లలో సభ్యుడిగా ఉన్నాడని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
"ఇండియా సాధించిన 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్ లలో యూసుఫ్ పఠాన్ కూడా సభ్యుడు. అన్ని రకాల క్రికెట్ నుంచి అతను రిటైర్ మెంట్ ప్రకటించాడు" అని పేర్కొంది. అతను జట్టుకు అందించిన సేవలను క్రీడాభిమానులు మరువబోరని పేర్కొంది.
కాగా, 57 వన్డేలు ఆడిన యూసుఫ్ పఠాన్ 113.60 స్ట్రయిక్ రేటుతో 810 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, మొత్తం 22 టీ-20లు ఆడిన పఠాన్, 146.58 స్ట్రయిక్ రేట్ తో 236 పరుగులు కూడా చేశాడు. 2012లో ఐపీఎల్ లో చివరిసారిగా కనిపించిన యూసుఫ్, కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ సభ్యుడిగానూ ఆడాడు. ఇక యూసుఫ్ తన రిటైర్ మెంట్ ను ప్రకటించిన తరవాత పలువురు క్రికెటర్లు స్పందించారు. అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్లు చేశారు.