Hasan Baba: కరుడుకట్టిన తాలిబాన్ ఉగ్రవాది హసన్ బాబాను హతమార్చిన పాకిస్థాన్!
- పాక్ పై అంతర్జాతీయ ఒత్తిడి
- నష్ట నివారణ చర్యల్లో పాకిస్థాన్
- వజీరిస్థాన్ సమీపంలో హసన్ ఎన్ కౌంటర్
కరుడుకట్టిన తాలిబాన్ కమాండర్ హసన్ బాబాను పాకిస్థాన్ భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపాయి. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ పై ఉగ్రవాద నిర్మూలనపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న సంగతి తెలిసిందే. పాక్ క్రెడిట్ లైన్ ను కూడా ఐక్యరాజ్యసమితి తగ్గించేసింది. తమ భూ భాగంపై నుంచి ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేస్తేనే అభివృద్ధికి తమవంతు సహకారం అందుతుందని ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు పాక్ కూడా చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో సౌత్ వజీరిస్థాన్ పట్టణ పరిధిలోని షార్ వంగీ టిజ్రా అనే ప్రాంతంలో హసన్ బాబా అలియాస్ నూరిస్థాన్ ఓ రహస్య శిబిరంలో ఉన్నాడన్న సమాచారం భద్రతా సిబ్బందికి అందింది. తెహ్రీక్ ఐ తాలిబాన్ సంస్థ పాకిస్థాన్ ప్రతినిధిగా ఉన్న ఇతను, 2007 నుంచి క్రియాశీలకంగా ఉన్నాడు. 50 మంది పాక్ సైనికులను హతమార్చిన కేసుల్లో నిందితుడు కూడా.
ఐఈడీ బాంబులను తయారు చేసి వాడటంలో నిష్ణాతుడైన హసన్ బాబా తమకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టని, కొండ ప్రాంతాల్లో తలదాచుకున్నాడన్న సమాచారం అందుకున్న సైనికులు అక్కడికి వెళ్లారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాలను చూడగానే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, ఆపై జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత హసన్ బాబా మరణించినట్టు గుర్తించామన్నారు.