Kiran Ahuja: భారతీయ అమెరికన్ కిరణ్ అహూజాను కీలక పదవికి నామినేట్ చేసిన బైడెన్
- జో బైడెన్ అధ్యక్షుడయ్యాక ఇండియన్ అమెరికన్లకు పెరుగుతున్న ఆదరణ
- ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌కు హెడ్‌గా నామినేట్ అయిన కిరణ్ అహూజా
- సెనేట్ ధ్రువీకరిస్తే తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డు పుటల్లోకి..
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక అక్కడి భారతీయ అమెరికన్లకు ఉన్నత పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఇండియన్ అమెరికన్లను కీలక పదవుల్లో నియమించిన బైడెన్.. తాజాగా న్యాయవాది, హక్కుల కార్యకర్త కిరణ్ అహూజా (49)ను ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌కు హెడ్‌గా నామినేట్ చేశారు. ఈ ఏజెన్సీ కింద దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కిరణ్ నామినేషన్‌ను సెనేట్ కనుక ధ్రువీకరిస్తే ఆ స్థానాన్ని అందుకున్న తొలి ఇండియన్ అమెరికన్‌గా కిరణ్ రికార్డులకెక్కుతారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న కిరణ్, ఒబామా హయాంలో ఏసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) కార్యక్రమానికి ఆరేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే, డైరెక్టర్ ఆఫ్ యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌కు 2015 నుంచి 2017 వరకు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఫిలాంథ్రఫీ నార్త్‌వెస్ట్ అనే రీజనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఫిలాంథ్రఫిక్ ఇనిస్టిట్యూషన్స్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.