Edappadi Palaniswami: ఎలెక్షన్ టైమ్... మెట్రో ఛార్జీలను తగ్గించిన పళనిస్వామి
- దగ్గర పడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- చెన్నై ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయం తీసుకున్న పళనిస్వామి
- కనీస ఛార్జీ రూ. 10కి తగ్గింపు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల అధినేతలు తమదైన శైలిలో యత్నాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఈరోజు కీలక ప్రకటన చేశారు. చెన్నై ఓటర్లను ఆకట్టుకునేందుకు మెట్రోరైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
2 కిలోమీటర్ల దూరం వరకు ఛార్జీని రూ. 10కి తగ్గించినట్టు ప్రకటనలో తెలిపారు. 2 నుంచి 5 కిలోమీటర్ల దూరానికి ఛార్జీని రూ. 20 చేశారు. 5 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఛార్జీని రూ. 30కి తగ్గించారు. 20 కిలోమీటర్ల పైన దూరానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 22 నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. క్యూఆర్ కోడ్ లేదా సీఎంఆర్ఎల్ స్మార్ట్ కార్డులను ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు.