Ayodhya Ram Mandir: లాకర్లు నిండిపోయాయి.. వెండి ఇటుకలు పంపించొద్దు: అయోధ్య రామ మందిర ట్రస్టు
- ఇప్పటికే 400 కేజీలకు పైగా వెండి ఇటుకలు అందాయి
- వాటిని భద్రపరచడంపై ఆందోళన చెందుతున్నాం
- విరాళాలను డబ్బు రూపంలో పంపండి
అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటాయి. మరోవైపు 400 కేజీలకు పైగా వెండి ఇటుకలు అందాయని రామ మందిర ట్రస్టు తెలిపింది. వెండి ఇటుకలతో ఇప్పటికే బ్యాంకు లాకర్లు నిండిపోయాయని... ఇకపై అందే ఇటుకలను ఉంచేందుకు స్థలం లేదని ట్రస్టు ప్రకటించింది. ఇకపై వెండి ఇటుకలను ఎవరూ పంపించవద్దని కోరింది.
మందిర నిర్మాణంలో ఉపయోగించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ఇటుకలను పంపుతున్నారని ట్రస్టు తెలిపింది. ఇటుకలతో లాకర్లు కూడా నిండిపోయాయని... వాటిని భద్రపరచడంపై తాము ఆందోళనకు గురవుతున్నామని చెప్పింది. విరాళాలు ఇవ్వాలనుకుంటున్న భక్తులు వాటిని డబ్బు రూపేణా ఇవ్వాలని కోరింది. మందిర నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని... ఈ సమయంలో మెటల్ రూపంలో విరాళాలు అవసరం లేదని చెప్పింది.