Malala: మలాలాకు ట్విట్టర్ ద్వారా బెదిరింపులు.. నిందితుడు అప్పట్లో కాల్పులు జరిపిన వ్యక్తే!
- 2012లో మలాలాపై కాల్పులు జరిపిన ఎహ్సాన్
- 2020 జనవరిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అదుపు నుంచి తప్పించుకున్న వైనం
- ఇతను జైలు నుంచి బయటకు ఎలా వచ్చాడని ప్రశ్నించిన మలాలా
నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్ కు బెదిరింపులు వచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన మలాలాపై 2012లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. స్కూలు నుంచి తిరిగి వస్తున్న ఆమెపై ఎహ్సానుల్లా ఎహ్సాన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆమె శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగినప్పటికీ... ఆమె ప్రాణాల నుంచి బయటపడింది. తాజాగా అదే వ్యక్తి మరోసారి ఆమెను బెదిరించాడు. ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు. నీతో, మీ నాన్నతో లెక్కలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని... ఇంటికి తిరిగి వచ్చేయాలని, ఈసారి ఎలాంటి పొరపాటు జరగదని ట్విట్టర్ ద్వారా బెదిరించాడు.
ఈ ట్వీట్ ను మలాలా రీట్వీట్ చేసింది. 'తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్' అనే ఉగ్రసంస్థకు ఇతను మాజీ అధికార ప్రతినిధి అని మలాలా తెలిపింది. గతంలో తనపై దాడికి పాల్పడింది ఇతనే అని చెప్పింది. తనతో పాటు చాలా మందిపై ఇతను దాడి చేశాడని తెలిపింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలను బెదిరిస్తున్నాడని మండిపడింది. ఇతను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ట్వీట్ ను పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మిలిటరీకి ట్యాగ్ చేసింది.
ఎహ్సాన్ ను పాక్ మిలిటరీ 2017లో అరెస్ట్ చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అదుపులో ఉన్న అతను 2020 జనవరిలో తప్పించుకున్నాడు. అతను ఎలా తప్పించుకున్నాడనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే పాక్ లోని వివిధ మీడియా సంస్థలకు అతను ఇంటర్వ్యూలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.