America: అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను.. 20 మంది మృతి

20 people dead in America due to snow fall

  • గత వారం రోజులుగా అమెరికాపై మంచు కత్తి
  • కరెంటు కోతలతో ప్రజలు, వ్యాపార వర్గాల ఇక్కట్లు
  • కరెంటు సరఫరాను నిలిపివేయడమే మంచిదంటున్న అధికారులు  

గత కొన్ని రోజులుగా అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. మంచు తుపాను ధాటికి టెక్సాస్, ఓక్లహామా, టెన్నెసీ, ఇల్లినాయస్ రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.

టెక్సాస్‌లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. విపరీతంగా కురుస్తున్న హిమపాతం కారణంగా ఈ నెల 14 నుంచి ఇప్పటి వరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, కరెంటు కోతలు ప్రజలను మరిన్ని ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. విద్యుత్ కోతల ప్రభావం దాదాపు 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై పడింది.

రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. హిమపాతం కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే కరెంటు సరఫరాను నిలిపివేయడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.

కరెంటు కోతల కారణంగా ఆసుపత్రుల సేవలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు, టెక్సాస్‌లో ఆరు లక్షల ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో గత వారం రోజుల్లో 130 కార్లు ప్రమాదానికి గురికాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

America
Texas
Snowfall
  • Loading...

More Telugu News