West Godavari District: బస్సు ప్రమాదంలో పలువురిని కాపాడిన భీమవరం బాలికకు సాహస బాలల పురస్కారం!
- గతేడాది 25న కైకలూరు వద్ద బస్సు ప్రమాదం
- కిటికీ అద్దాలు బద్దలుగొట్టి పలువురిని కాపాడిన వినూత్న
- సాహస బాలల పురస్కారానికి ఎంపికైనట్టు ప్రభుత్వం నుంచి సమాచారం
బస్సు ప్రమాదంలో పలువురిని కాపాడిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బాలిక పోతాప్రగడ బాలసాయిశ్రీ సాహితీ వినూత్న సాహస బాలల పురస్కారం-2020కి ఎంపికైంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సమాచారం అందినట్టు బాలిక తండ్రి రమేశ్ తెలిపారు. భీమవరంలోని డీఎన్నార్ స్కూల్‌లో చదువుతున్న వినూత్న గతేడాది జనవరి 25న పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆర్టీసీ బస్సులో స్వస్థలానికి బయలుదేరింది.
ఈ క్రమంలో కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆలపాడు వద్ద బస్సు అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం షాక్ నుంచి తేరుకున్న వినూత్న బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించింది.
కిటికీ అద్దాలు బద్దలుగొట్టి తన స్నేహితురాలు, టీచర్‌తోపాటు మరో ముగ్గురు వృద్ధులను బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడింది. ఆమె ధైర్య సాహసాలను గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి బాలిక పేరును సాహస బాలల అవార్డు కోసం ప్రతిపాదించగా, తాజాగా ఆమె ఎంపికైనట్టు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది.