Ravichandran Ashwin: విదేశాల్లోని పిచ్ లపై రవిశాస్త్రి గానీ, గవాస్కర్ గానీ విమర్శలు చేయడం ఎప్పుడూ చూడలేదు: అశ్విన్
- రెండో టెస్టులో టీమిండియా భారీ విజయం
- చెన్నై పిచ్ బాగాలేదంటూ విదేశీ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు
- తామెప్పుడూ విదేశాల్లో పరిస్థితులపై వ్యాఖ్యలు చేయలేదన్న అశ్విన్
- కొందరి మనస్తత్వాలు అంతేనని వెల్లడి
చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన చెపాక్ స్టేడియం పిచ్ పై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తాము విదేశాల్లో పర్యటించిన సమయంలో అక్కడి పిచ్ లు, పరిస్థితులపై తమ అభిప్రాయాలు తమకుండేవని, అయితే జట్టు గానీ, మాజీ క్రికెటర్లు గానీ ఎన్నడూ విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు.
వ్యక్తుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, కానీ తాము విదేశీ పర్యటనల సమయంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని అన్నాడు. అంతేకాదు, భారత క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్ గానీ, రవిశాస్త్రి గానీ విదేశీ పర్యటనల్లో లొసుగులపై స్పందించిన దాఖలాలు లేనేలేవని, పిచ్ ల గురించి, పేస్ కు సహకరించేలా వాటిపై దట్టంగా మొలిపించిన గడ్డి గురించి వారు మాట్లాడడాన్ని ఎప్పుడూ చూడలేదని తెలిపాడు. తనకు తెలిసినంత వరకు ఇది మనస్తత్వాలకు సంబంధించిన విషయం అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
చెన్నైలో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 317 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అశ్విన్ మొత్తం 8 వికెట్లు తీయడమే కాదు, అద్భుతంగా ఆడి సెంచరీ నమోదు చేశాడు.
అయితే, ఇంగ్లండ్ ఈ పిచ్ పై తీవ్రంగా తడబాటుకు గురికావడంతో మాజీలు పిచ్ బాగాలేదని వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్ వా కూడా పిచ్ పై పెదవి విరిచాడు. ఇది టెస్టు క్రికెట్ కు సరిపోయే పిచ్ కాదని, ఆడలేనంత దారుణంగా ఉందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.