ISRO: ఉపగ్రహంలో నరేంద్ర మోదీ ఫొటో, భగవద్గీత!
- మరో 25 వేల మంది పేర్లు కూడా
- జాబితాలో చెన్నై పాఠశాలలోని అందరి పేర్లు
- ఈ నెల 28న రాకెట్ ప్రయోగం
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది మొట్టమొదటి సారిగా దేశీయ ప్రైవేటు ఉపగ్రహాలను పంపిస్తోంది. వీటిలో ఒక ఉపగ్రహం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో పాటు భగవద్గీతను, మరో 25 వేల మంది పౌరుల పేర్లను పంపాలని నిర్ణయించారు. వీరిలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారు, అవార్డులను అందుకున్న వారి పేర్లూ ఉంటాయని సైంటిస్టులు తెలిపారు.
ఈ నెల 28న పీఎస్ఎల్వీ సీ-51 ను ప్రయోగించనున్న ఇస్రో, దాని ద్వారా అమెజానియా-1తో పిటు ఇండియన్ ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన ఆనంద్, యునిటీశాట్, సతీశ్ ధావన్ ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపనుంది. వీటిల్లో ఆనంద్ కు కొంత ప్రత్యేక ఉంది. కర్ణాటకకు చెందిన స్టార్టప్ కంపెనీ 'పిక్సెల్' దీన్ని తయారు చేసింది. దీనితో పాటే సతీశ్ ధావన్ పేరిట తయారైన ఉపగ్రహాన్ని స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. వీటితో కోయంబత్తూరు కాలేజీ విద్యార్థులు తయారు చేసిన శ్రీశక్తి శాట్, నాగపూర్ సైంటిస్టులు తయారు చేసిన జీహెచ్ఆర్సీఈ శాట్ తదితరాలు కూడా తమతమ కక్ష్యల్లోకి వెళ్లనున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఫొటోను స్పేస్ లోకి పంపించనున్నామని స్పేస్ కిడ్జి ప్రకటించింది. మోదీ పేరు, దాని కింద ఆత్మ నిర్భర్ భారత్ పదాలు, భగవద్గీత ప్రతి, 25 వేల మంది పేర్లను పంపనున్నామని సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ వెల్లడించారు. స్పేస్ లోకి పంపేందుకు పేర్లు కావాలని అడుగగా, విశేష స్పందన వచ్చిందని, 1000 మంది విదేశీయులు, చెన్నైలోని ఓ పాఠశాల విద్యార్థులందరి పేర్లతో సహా 25 వేల ఎంట్రీలు వచ్చాయని, వాటన్నింటినీ స్పేస్ లోకి పంపనున్నామని ఆమె పేర్కొన్నారు.
కాగా, 28వ తేదీ ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ-51 వాహక నౌక నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగరనుంది.