V Srinivas Goud: షర్మిల పార్టీతో మాకేం నష్టంలేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రచారం
- ఇటీవల లోటస్ పాండ్ లో షర్మిల సమావేశం
- స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి
- షర్మిల పార్టీతో ఏం జరగదని వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారంటూ జోరుగా సాగుతున్న ప్రచారంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారని, అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులకు తెలంగాణ ప్రజలు మద్దతు పలుకుతారని తాను భావించడంలేదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
70 ఏళ్ల ఇతరుల పాలనలో ఆనందం ఎరుగని ప్రజలు... కేసీఆర్ పాలనలో సుఖశాంతులతో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ స్థాపించినా తమకొచ్చిన నష్టమేమీ లేదని, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల పార్టీలు తెలంగాణలో ఏమయ్యాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. షర్మిల పార్టీతో తెలంగాణలో మార్పులు వస్తాయని తాను అనుకోవడంలేదని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. షర్మిల ఎవరి బాణం కాదని, ఏపీలో ఏం చేయలేక ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు.
ఇటీవలే హైదరాబాదు లోటస్ పాండ్ లో అభిమానులు, సన్నిహితులతో వైఎస్ షర్మిల సమావేశం కావడంతో పార్టీ ప్రారంభించనున్నట్టు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.