Investment Citizenship: విదేశీ పౌరసత్వం కోసం తహతహలాడుతున్న భారతీయ ధనికులు.. పెరిగిన దరఖాస్తులు!

Indian rich top world in looking to leave country

  • 2019తో పోలిస్తే కరోనా సంవత్సరం 2020లో 62% పెరుగుదల
  • వివిధ దేశాల్లో పెట్టుబడి ద్వారా వచ్చే పౌరసత్వాలపై విచారణ
  • ఎక్కువగా కెనడా, ఆస్ట్రియా, పోర్చుగల్ పైనే ఆసక్తి
  • అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాపై సన్నగిల్లిన నమ్మకం
  • న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ నివేదికలో వెల్లడి

కరోనాతో విదేశీయానాలు భారీగా పడిపోయాయి. విదేశీ చదువులకూ ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ, మన దేశంలోని ధనికులకు మాత్రం విదేశీ పౌరసత్వం తీసుకోవాలన్న ఆకాంక్ష మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే 2019తో పోలిస్తే కరోనా ప్రభావం ఎక్కువున్న 2020లో అది భారీగా పెరిగిపోయింది.

మాతృదేశాన్ని వదిలి విదేశీ పౌరసత్వం కోసం తహతహలాడే వారి సంఖ్య 62.6 శాతం పెరిగింది. మామూలుగా అయితే, విదేశాల్లో పౌరసత్వం రాదు. కానీ, ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా పౌరసత్వం ఇస్తుంటాయి కొన్ని దేశాలు. అయితే, అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని.

అయినా, గానీ మన దేశానికి చెందిన 7 వేల మంది గత ఏడాది పెట్టుబడి పెట్టడం ద్వారా విదేశీ పౌరసత్వం కోసం విచారించినట్టు న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ విడుదల చేసిన అంతర్జాతీయ ఆర్థిక వలస నివేదికలో వెల్లడైంది. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అయితే, 2019లో కేవలం 1,500 మందే దాని గురించి విచారించినట్టు నివేదిక పేర్కొంది.

ఎక్కువగా కెనడా, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, టర్కీల్లో పౌరసత్వం గురించి ఆరా తీసినట్టు వెల్లడించింది. వాస్తవానికి అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలపై భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారని, ఈసారి కరోనా నేపథ్యంలో కెనడా మినహా మిగతా దేశాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదని పేర్కొంది.

కెనడా, ఆస్ట్రేలియాల్లో పౌరసత్వం రావాలంటే చాలా సమయం పడుతుందని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అనే సంస్థకు చెందిన నిపుణులు నిర్భయ్ హందా చెప్పారు. మరోవైపు చాలా మంది ఆస్ట్రియా పౌరసత్వం కోసం ఎంక్వైరీ చేశారని హందా చెప్పారు. ఆస్ట్రియా పాస్ పోర్ట్ తో 187 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉండడంతో దానిపై ఎక్కువగా ఆసక్తి చూపించారని చెప్పారు. అంతేగాకుండా ఐరోపా సమాఖ్యలోని ఏ దేశంలోనైనా ఉండేందుకు మాల్టా, ఆస్ట్రియా పౌరసత్వాలు అవకాశం కల్పిస్తాయన్నారు.

  • Loading...

More Telugu News