Nirmala Sitharaman: మా 'క్రోనీ'లు సామాన్య ప్రజలే!: నిర్మలా సీతారామన్​

Rahul Becomes a Doomsday Man For India attacks Fin Min Nirmala Sitharaman

  • బడ్జెట్ పై చర్చలో కాంగ్రెస్ నేతపై మండిపడిన ఆర్థిక మంత్రి
  • బహుశా వారి వెనకే వారు చెబుతున్న క్రోనీలు ఉండి ఉండొచ్చని కామెంట్
  • ‘మేం ఇద్దరం.. మాకు ఇద్దరు’ వ్యాఖ్యలు వారికే సరిపోతాయని కౌంటర్
  • రాహుల్ వినాశనకారుడిగా పరిణమించారన్న మంత్రి 

క్రోనీ క్యాపిటలిస్టుల (ఆశ్రిత పెట్టుబడిదారుల)కే మేలు చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై పదే పదే రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి కౌంటరే ఇచ్చారు. తమ క్రోనీలు ప్రజలేనని రాహుల్ కు తేల్చి చెప్పారు. దేశానికి రాహుల్ వినాశనకారుడిగా పరిణమించారని మండిపడ్డారు.

‘‘మా క్రోనీలు ఎవరు? మా క్రోనీలు సామాన్య ప్రజలే. క్రోనీలు ఎక్కుడున్నారు? బహుశా ఓటమిని అప్పగించి మూలకు కూర్చోబెట్టిన ఆ పార్టీ వెనక నక్కి ఉంటారు’’ అని ఆమె అన్నారు. శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ పై మాట్లాడిన ఆమె.. రాహుల్ పై మండిపడ్డారు.

ఓపెన్ టెండర్లు, అంతర్జాతీయ టెండర్లు లేకుండానే వారి వెనకున్న వారికి అప్పగించేశారని ఆమె ఆరోపించారు. వారి వల్లే ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైపోతోందని కాంగ్రెస్ భావిస్తుండొచ్చన్నారు. దేశానికి రాహుల్ గాంధీ వినాశనకారుడిగా మారారని అన్నారు. రైతుల విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు రుణ మాఫీ చేయలేదని ఆమె నిలదీశారు.

‘మేమిద్దరం.. మాకు ఇద్దరు’ అన్న రాహుల్ వ్యాఖ్యలపైనా నిర్మల మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడడం బాగానే ఉంది గానీ.. కాంగ్రెస్ అల్లుడుగారి భూమి డీల్స్ పై మాత్రం మాట్లాడట్లేదు’’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ వ్యాఖ్యలు వారికే సరిగ్గా నప్పుతాయన్నారు.

పీఎం స్వనిధి యోజన కింద ఎందరో వీధి వ్యాపారులకు రుణాలిచ్చామన్నారు. అది కూడా క్రోనీలకు ఇచ్చినట్టే అవుతుందా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఆ పార్టీ పాలించిన రాష్ట్రాలు, ఇప్పుడు పాలిస్తున్న రాష్ట్రాల్లో అల్లుడుగారికి భూములు ఇస్తున్నారని మండిపడ్డారు.

సంస్కరణలు చేయకుండా ప్రభుత్వాన్ని కరోనా మహమ్మారి అడ్డుకోలేకపోయిందని నిర్మల అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేశామన్నారు.

  • Loading...

More Telugu News