Amit Shah: వ్యాక్సినేషన్ పూర్తయ్యాక పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తాం: అమిత్ షా
- తొలుత ‘మథువా’లకే పౌరసత్వం
- దేశంలోని మైనారిటీలకు వచ్చిన నష్టం ఏమీ లేదు
- పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే విజయం
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
‘పరివర్తన్ యాత్ర’లో భాగంగా నిన్న పశ్చిమ బెంగాల్ లోని కూచ్‌బిహార్, ఠాకూర్‌నగర్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో షా మాట్లాడారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ‘మథువా’ సామాజిక వర్గం జనాభా ఎక్కువ. ఈ నేపథ్యంలో షా మాట్లడుతూ పౌరసత్వ సవరణ చట్టం అమలు ప్రారంభం కాగానే తొలుత మథువా శరణార్థులకే పౌరసత్వాన్ని అందిస్తామన్నారు.
సీఏఏను అమలు చేయడం వల్ల దేశంలోని మైనారిటీలు ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండరని పేర్కొన్న షా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.