Chinthamaneni Prabhakar: టీడీపీ నేత చింతమనేనిపై కొత్త కేసు నమోదు
- పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని కేసు
- ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారన్న డీఎస్పీ
- చింతమనేనికి 41ఏ నోటీసులు జారీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెదవేగి మండలం వేగివాడలో టీడీపీ కార్యకర్తలతో కలిసి చింతమనేని ర్యాలీ నిర్వహించారని ఆయన తెలిపారు. ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో చింతమనేనితో పాటు, ఆయన అనుచరులు కొంతమందిపై పెదవేగి పీఎస్ లో కేసు నమోదు చేశామని తెలిపారు. మరోవైపు చింతమనేనిని, ఆయన అనుచరులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా పెదవేగి ఎస్ఐ సుధీర్ చింతమనేనికి 41ఏ నోటీసులు జారీ చేశారు.