Vijaya Reddy: మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి
- మేయర్ పీఠాన్ని ఆశించిన పీజేఆర్ కుమార్తె
- కేకే కుమార్తె పేరును ఖరారు చేసి అధిష్ఠానం
- ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయిన విజయారెడ్డి
హైదరాబాద్ మేయర్ పదవి ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఇప్పటి వరకు తాజాగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకునే కార్యక్రమం ప్రారంభం కానుంది. తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది.
మేయర్ అభ్యర్థిగా కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం. మరోవైపు, మేయర్ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే... మేయర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనకుండా ఆమె వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోవడంతో టీఆర్ఎస్ నేతలు షాక్ కు గురయ్యారు. విజయారెడ్డికి అనుకూలంగా పీజేఆర్ అభిమానులు నినాదాలు చేశారు. తమ నాయకురాలికి కాకుండా, కేకే కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.