Gram Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ పోలింగ్
- ఉదయం 10.30 గంటలకు 34 శాతం పోలింగ్
- అత్యధికంగా కర్నూలు జిల్లాలో 49 శాతం పోలింగ్
- అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 24 శాతం
- మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరగనున్న పోలింగ్
ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరగనుంది. విజయనగరం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల పరిధిలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10.30 గంటల సమయానికి 34.28 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్టు ఓటింగ్ సరళి చెబుతోంది.
ఉదయం 10.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.... అత్యధికంగా కర్నూలు జిల్లాలో 49 శాతం పోలింగ్ జరగ్గా, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 24 శాతం ఓటింగ్ జరిగింది. విశాఖ జిల్లాలో 40.78 శాతం, చిత్తూరు జిల్లాలో 36.38 శాతం, కృష్ణా జిల్లాలో 36 శాతం, గుంటూరు జిల్లాలో 30 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 29.15 శాతం, కడప జిల్లాలో 29.21 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 29 శాతం, ప్రకాశం జిల్లాలో 28.65 శాతం, అనంతపురం జిల్లాలో 27 శాతం, నెల్లూరు జిల్లాలో 26.72 శాతం పోలింగ్ జరిగింది.