Telangana: అక్కడి బార్లకు అంత డిమాండ్ మరి... దరఖాస్తులతోనే రూ. 73 కోట్లకు పైగా తెలంగాణ ఖజానాకు!
- నేరేడుచర్లలోని ఒకే బార్ కు 248 దరఖాస్తులు
- హైదరాబాద్ లో 55 బార్లకు 1,074 మంది పోటీ
- బుధవారం నాడు డ్రా ద్వారా కేటాయింపు
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మునిసిపాలిటీ బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 72 మునిసిపాలిటీల్లో 159 బార్ల ఏర్పాటుకు జనవరి 25న ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా, మొత్తం 7,380 దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తు ఫీజుతోనే ఖజానాకు రూ. 73.78 కోట్ల ఆదాయం లభించింది. ఇక నేరేడుచర్ల మునిసిపాలిటీలో ఒకే ఒక్క బార్ కు పర్మిషన్ ఇవ్వగా, దీన్ని సొంతం చేసుకునేందుకు ఏకంగా 248 దరఖాస్తులు వచ్చాయి.
ఇక పాత బార్లలో తొర్రూరులో ఉండే ఒకే బార్ కు అత్యధికంగా 278 దరఖాస్తులు వచ్చాయి. సోమవారంతో దరఖాస్తులకు గడువు ముగియగా, బుధవారం నాడు డ్రా ద్వారా బార్లను కేటాయించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మునిసిపాలిటీల్లో మాత్రమే బార్ల ఏర్పాటుకు అతి తక్కువ స్పందన కనిపించింది. నిజామాబాద్ లో ఏడు బార్లకుగాను 7, బోధన్ లో మూడు బార్లకు గాను మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 బార్లకు గాను 1,074 దరఖాస్తులు వచ్చాయి. పది కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లు 147 ఉన్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో నూతన మునిసిపాలిటీల్లో ఐదు బార్లు నోటిఫై చేయగా, 638 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట పరిధిలో ఒకే బార్ ఉండగా, దీనికి 277 మంది పోటీ పడ్డారు.
బుధవారం నాడు డ్రా అనంతరం గెలిచిన వారికి 17న షాపులను కేటాయించనున్నారు. ఆపై మూడు నెలల్లోగా ఎక్సైజ్ శాఖ సూచించే నిబంధనలను బార్లు పొందిన యజమానులు పూర్తి చేయాల్సి వుంటుంది. జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రా జరుగుతుంది.