YSRCP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న వైసీపీ నేతలు!
- విశాఖ బాలచెరువు రోడ్ వద్ద అఖిలపక్ష పార్టీల నిరసన
- పాల్గొన్న అవంతి, గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంవీవీ
- ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు తాము పోరాడుతామని స్పష్టం
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీలో అన్ని పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ బాలచెరువు రోడ్ వద్ద అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు నిరసన సభ చేపట్టడంతో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా అక్కడకు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు. దాన్ని దీర్ఘకాలం పాటు పోరాడి సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ ఉక్కు పరిశ్రమ కోసం అప్పట్లో 32 మంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు.