Bengaluru: కట్నం కోసం ఎన్నో వేధింపులు...ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు!
- బెంగళూరులో పని చేస్తున్న వర్తికా కటియార్
- భర్త భారత రాయబార కార్యాలయంలో అధికారి
- ఏడుగురిపై పోలీసు కేసు నమోదు
తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఐపీఎస్ అధికారిణి, బెంగళూరు పోలీసు ప్రధాన కార్యలయంలో విధులు నిర్వహిస్తున్న వర్తికా కటియార్ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆమె భర్త న్యూఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి నితిన్ సుభాష్ కావడమే ఇందుకు కారణం. బెంగళూరు కబ్బన్ పార్కు పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వర్తికా కటియార్ 2009 ఐపీఎస్ అధికారిణి కాగా, నితిన్ సుభాష్ తో 2011లో వివాహం జరిగింది.
తన భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు బానిసయ్యాడని, మానేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని వర్తిక ఫిర్యాదు చేశారు. తాను వారిస్తే చెయ్యి చేసుకునేవాడని, 2016లో తన చేతిని విరిచేశాడని కూడా ఆమె తెలిపారు. గత దీపావళికి తనకు ఎటువంటి కానుకలనూ ఇవ్వలేదని ఆరోపిస్తూ, విడాకులకు డిమాండ్ చేశారని అన్నారు. ఇప్పటికే తన అమ్మమ్మ నుంచి రూ. 35 లక్షలు, అదనంగా ఖర్చులకంటూ మరో 5 లక్షల నగదు తీసుకున్నారని, ఇంకా ఇవ్వాలని అడుగుతున్నాడని తెలిపారు. వర్తిక ఫిర్యాదుతో సుభాష్ కుటుంబీకులు ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.