Vijayasai Reddy: నన్ను కూడా చంపండి అంటూ చంద్రబాబు వీధి నాటకం మొదలుపెట్టారు: విజయసాయిరెడ్డి
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు
- రాజకీయంగా ఎప్పుడో చచ్చిన పాము అంటూ విమర్శలు
- మళ్లీ చంపాల్సిన అవసరం ఎవరికుంటుందని వెల్లడి
- ప్రజల సానుభూతి కోసం లేచి బుసలు కొడుతున్నారని కామెంట్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. నన్ను కూడా చంపండి అంటూ చంద్రబాబు వీధి నాటకం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.
రాజకీయంగా ఎప్పుడో చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం ఎవరికుంటుందని విజయసాయి ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిందని, అయినా ఏదో విధంగా ప్రజల సానుభూతితో లబ్ది పొందాలని లేచి బుసలు కొడుతున్నారని విమర్శించారు. ఇటీవల కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి, అచ్చెన్నాయుడి అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలపైనే విజయసాయి స్పందించినట్టు తెలుస్తోంది.
అటు, టీడీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపైనా విజయసాయి వ్యంగ్యం ప్రదర్శించారు. నిన్న అమిత్ షా వద్దకు వెళ్లిన టీడీపీ ఎంపీలు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వీడియో చూపించి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందని, ఆ వీడియో 2016-17 నాటిదని వెల్లడించారు. అంటే దొంగలు ఎవరు? నేరం ఎవరిది? అని నిలదీశారు.
"కోర్టు బోనులో ముద్దాయి భోరున ఏడుస్తూ జడ్జిగారిని అడిగాడట... తల్లీ, తండ్రీ లేనివాడిని... నన్ను శిక్షించకండని వేడుకున్నాడట. ఇంతకీ అతను ఏం నేరం చేశాడని జడ్జి గారు అడిగితే, ఆ తల్లిదండ్రులను చంపింది వీడేనని ప్రాసిక్యూషన్ వారు చెప్పారట. ఇప్పుడు టీడీపీ ఎంపీలు అమిత్ షా వద్దకు వెళ్లడం కూడా ఇలాగే ఉంది" అని ఎద్దేవా చేశారు.