Greta Thenberg: వెనక్కు తగ్గిన గ్రెటా థెన్ బర్గ్... రైతు నిరసనలపై చేసిన ట్వీట్ తొలగింపు!
- సెలబ్రిటీలు, నేతల నుంచి విమర్శలు
- తన ట్వీట్ ను తొలగించిన పర్యావరణ కార్యకర్త
- ఇండియాను కించపరిచారని విమర్శల వెల్లువ
పర్యావరణ కార్యకర్త, రెండు రోజుల క్రితం ఇండియాలో జరుగుతున్న రైతు నిరసనలపై ట్వీట్ చేసి, భారత ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గ్రెటా థెన్ బర్గ్ ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. తన ట్విట్టర్ ఖాతాలో రైతు నిరసనలపై ఓ ట్వీట్ ను పోస్ట్ చేసిన గ్రెటా, దాన్ని డిలీట్ చేసింది.
గ్రెటా చేసిన ట్వీట్ వైరల్ అయిన తరువాత, ఇండియాను కించపరిచేలా ఆమె వ్యాఖ్యానించారంటూ, లక్షలాది మంది భారత ట్విట్టర్ యూజర్లు గ్రెటాపై విరుచుకుపడ్డారు. 'గ్రెటా థెన్ బర్గ్ ఎక్స్ పోజ్డ్' అంటూ, ఆమె వైఖరిపై విమర్శలు గుప్పించారు. గత రాత్రి 11 గంటల సమయానికి 194 వేల సార్లు ఆమెను విమర్శిస్తూ ట్వీట్లు వచ్చాయంటే, భారతీయులు, ప్రవాస సమాజం ఆమెపై ఎంత ఆగ్రహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, "మీకు సాయం కావాలంటే, ఇవిగో ఆయుధాలు" అంటూ ఓ గూగుల్ డాక్యుమెంట్ ను సాయంత్రం 5.20 గంటలకు గ్రెటా షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలోనే ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు, రీట్వీట్లు వెల్లువెత్తాయి. గ్రెటాకు ఇండియా గురించి ఏం తెలుసునని పలువురు ప్రశ్నించారు. దీంతో ఆమె ట్వీట్ ను తొలగించింది. ఇక ఆమె గూగుల్ డాక్యుమెంట్ గా పోస్ట్ చేసినదాన్ని ఎవరు తయారు చేశారన్న విషయమై క్లారిటీ ఇంకా రాలేదు.
ఈ డాక్యుమెంట్ లో రైతుల గొంతు మరింతగా ప్రతిధ్వనించేలా తీసుకున్న చర్యల గురించి, ప్రభుత్వంపై తెస్తున్న ఒత్తిడి గురించి ప్రస్తావిస్తోంది. జనవరి 23 వరకూ రైతు నిరసనలపై వైరల్ అయిన హ్యాష్ ట్యాగ్ లను ఇందులో పొందుపరిచారు. రైతుల ఆందోళనలపై, సాగు చట్టాలు వద్దంటూ వారి నిరసనలపై ఐరాస చేసిన వ్యాఖ్యలూ ఇందులో ఉన్నాయి. "హౌ కెన్ యూహెల్ప్" అనే సబ్ టైటిల్ తో ఇది కనిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్న రైతుల గురించిన వీడియోల లింక్ లు కూడా ఇందులో ఉండటం గమనార్హం.