Nimmagadda Ramesh: యాప్ పై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయడంపై నిమ్మగడ్డ రమేశ్ స్పందన!
- ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించిన నిమ్మగడ్డ
- ఎలాంటి సందేహాలకు తావు లేకుండా యాప్ ను రూపొందించామన్న నిమ్మగడ్డ
- ప్రభుత్వం పిటిషన్ వేయకపోతేనే ఆశ్చర్యపోవాలని వ్యాఖ్య
పంచాయతీ ఎన్నికల కోసం ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలోని కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ యాప్ ను ఆవిష్కరించారు. మరోవైపు ఈ యాప్ పై వైసీపీ మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ కార్యాలయంలో ఈ యాప్ ను తయారు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ యాప్ ను కాకుండా సీఈసీ యాప్ ను వాడాలని అంటున్నారు. ఈ యాప్ పై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడంలో ఆశ్చర్యం లేదని, పిటిషన్ వేయకపోతేనే ఆశ్చర్యపోవాలని అన్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావు లేకుండా యాప్ ను రూపొందించామని చెప్పారు. ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత, ఎలాంటి వివాదాలకు తావు లేదని అన్నారు. తాను తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేస్తానని చెప్పారు.