sasikala: శశికళను అన్నాడీఎంకేలో తిరిగి చేర్చుకోం: పార్టీ సీనియర్ నేతలు
- నిన్న జైలు నుంచి శశికళ విడుదల
- త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- అన్నాడీఎంకేలో టీటీవీ దినకరన్ పార్టీ విలీనంపై మాత్రం సానుకూలం
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె త్వరలో అక్కడి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఆమె కీలకంగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే, శశికళను తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అంటున్నారు. తమ పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు పార్టీ కో కన్వీనర్, ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీని సమర్థంగా ముందుకు తీసుకెళుతున్నారని వారు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేసిన అనుభవం పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి ఉందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిద్దరూ కలిసి పార్టీని గెలిపించే దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. అయితే, టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని అన్నాడీఎంకేలో విలీనమయ్యేలా చూడాలని చెబుతున్నారు.