Joe Biden: బైడెన్ కు తొలి ఎదురు దెబ్బ... డిపోర్టేషన్ ఆదేశాలపై న్యాయమూర్తి స్టే!
- వలస దారులకు న్యాయం చేస్తానని ఎన్నికలకు ముందే హామీ
- డిపోర్టేషన్ ను 100 రోజులు వాయిదా వేస్తూ ఉత్తర్వులు
- స్టే విధించిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి
గత వారం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటూ పట్టుబడిన వారిని తిరిగి స్వదేశాలకు పంపే విషయమై, 100 రోజుల తాత్కాలిక విరామాన్ని ప్రకటిస్తూ, ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయగా, కోర్టు దానిపై స్టే విధించింది. బైడెన్ నిర్ణయం అమెరికాకు నష్టదాయకమంటూ టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్ స్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా, ట్రంప్ ఆదేశాలపై 14 రోజుల స్టేను విధిస్తూ, న్యాయమూర్తి డ్రూ టిప్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన అన్నారు.
డిపోర్టేషన్లను పూర్తిగా నిలిపివేస్తే, అది ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని ఈ సందర్భంగా పాక్ స్టన్ వ్యాఖ్యానించారు. కాగా, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజున.. ఏ విధమైన పత్రాలూ లేకుండా యూఎస్ లో నివాసం ఉంటున్న వారిని వెనక్కు పంపే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ, మారటోరియంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 1, 2020కన్నా ముందుగా అమెరికాలో ఉంటున్న వారికే ఈ అవకాశం లభిస్తుంది.
కాగా, వైట్ హౌస్ నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడగానే, ట్రంప్ కు సన్నిహితుడిగా ముద్రపడిన పాక్స్ టన్ వెంటనే కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాలు దేశ పౌరుల ప్రయోజనాలను కాపాడటంలో ముందుంటాయనే తాను భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇమిగ్రెంట్ల విషయంలో న్యాయ పోరాటం ఇప్పుడే మొదలైందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.