Mamata Banerjee: మమతా బెనర్జీ నోట నాలుగు రాజధానుల మాట!
- నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
- కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో మమత ఆసక్తికర వ్యాఖ్యలు
- భారత్ కు నాలుగు రాజధానులు ఉండాలని వెల్లడి
- రొటేషన్ పద్ధతిలో రాజధానులు ఉండాలని వివరణ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్ కతాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ కు నాలుగు రాజధానులు ఉండాలని అభిలషించారు. అది కూడా రొటేషన్ పద్ధతిలో ఆ నాలుగు రాజధానుల నుంచి పరిపాలన సాగించాలని అభిప్రాయపడ్డారు. భారత్ వంటి విశాల దేశానికి నాలుగు రాజధానులు ఉండడం మేలు చేస్తుందని అన్నారు. నాడు బ్రిటీషర్లు కోల్ కతా నుంచి యావత్ దేశాన్ని పాలించారు... దేశానికి ఒక్క రాజధానే ఎందుకు ఉండాలి...? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆమె బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేతాజీ ఎన్నికలప్పుడే గుర్తొస్తాడా అని నిలదీశారు. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నాడు నేతాజీని దేశనాయక్ అని సంబోధించారని, అందుకే తాము ఆయన జయంతిని దేశనాయక్ దివస్ గానే జరుపుకుంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నేతాజీ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినం ప్రకటన ఎందుకు చేయడంలేదని అడిగారు.