Chandrababu: వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి: చంద్రబాబు
- అన్ని పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలి
- వైసీపీ దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవాలి
- ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కాసేపటి క్రితం ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారు. మరోవైపు తమ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేశారు.
వైసీపీ పతనానికి ఈ పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ రౌడీ రాజ్యానికి ముకుతాడు వేయాలని చెప్పారు. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవాలని... బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని... వైసీపీ నేతల దౌర్జన్యాలను సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి, అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ప్రజల్లో వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీలో ఉందని అన్నారు.