Wahsington Sundar: నా కుమారుడు లెజెండ్ అవుతాడు: వాషింగ్టన్ సుందర్ తండ్రి
- ఆసీస్ లో నా కుమారుడి ప్రదర్శన ప్రత్యేకమైనది
- వాషింగ్టన్ సహజంగానే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్
- వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్ లో భారత యువగాళ్లు సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరి ప్రశంసలు పొందారు. ఇలాంటి వారిలో వాషింగ్టన్ సుందర్ ఒకడు. తన ఆల్ రౌండ్ ప్రతిభతో బ్రిస్బేన్ టెస్టులో చారిత్రక విజయం సాధించడంలో తన వంతు పాత్రను పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేయడంతో పాటు, 3 వికెట్లు తీసుకున్నాడు. ఛేజింగ్ లో సైతం 22 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
తన కొడుకు ఒక లెజెండ్ అవుతాడని సుందర్ తండ్రి ఎం.సుందర్ అన్నారు. ఆసీస్ లో తన కుమారుడి ప్రదర్శన చాలా ప్రత్యేకమైనదని కొనియాడారు. వాషింగ్టన్ సహజంగానే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అని, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పరుగులు రాబట్టాడని చెప్పారు. అతనిలో అంకింతభావం, శ్రమించేతత్వం, నైపుణ్యం ఉన్నాయని అన్నారు. టీమిండియాలో అతనికి సుదీర్ఘమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడని ఆశిస్తున్నానని చెప్పారు. చివరి టెస్టులో రెగ్యులర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ ఇద్దరూ లేకపోవడంతో వాషింగ్టన్ కు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకున్నాడు.