Chandrababu: పశ్చిమ గోదావరి జిల్లా వింత వ్యాధిపై చంద్రబాబు స్పందన
- పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం
- గ్రామీణ ప్రాంతాల్లోనూ బాధితులు
- నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేశారన్న చంద్రబాబు
- ఇప్పుడది కొమిరేపల్లికి కూడా పాకిందని వెల్లడి
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంభవించిన వింత వ్యాధి జాతీయస్థాయిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడవే లక్షణాలతో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగు రోజులు హడావిడి చేసి ఆపై వదిలేశారని ఆరోపించారు. ఆ వింత వ్యాధి ఇప్పుడు దెందులూరు మండలం కొమిరేపల్లికి కూడా పాకిందని వెల్లడించారు.
పాలకులు కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టాలని హితవు పలికారు. కొమిరేపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజలు అంటున్నారని, ప్రభుత్వం ప్రజలకు కనీసం సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని చంద్రబాబు విమర్శించారు. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చగలగాలి కానీ, వైసీపీ పాలనలో తాము ప్రాణాలతో ఉంటే చాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు.