Prime Minister: టీమిండియా గెలుపే యువతకు గొప్ప స్ఫూర్తి: ప్రధాని మోదీ

PM Cites Cricket Teams Win Says Approach All About Self Reliant India

  • అనుభవం లేని టీమ్ తో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది
  • ఓటమి నుంచి గెలుపు వరకు దూసుకెళ్లింది
  • పాజిటివ్ మైండ్ సెట్ ఎంత ముఖ్యమో ఆ గెలుపే చెప్తుంది
  • తేజ్ పూర్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు సూచనలు
  • కరోనాతో పోరును ఇండియా–ఆస్ట్రేలియాతో పోల్చిన ప్రధాని

గబ్బాలో అనుభవం లేని కుర్రాళ్లతో బరిలోకి దిగి, ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక గెలుపును సాధించిన టీమిండియాను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే దేశ ప్రజలు సవాళ్లపై పోరాడాలన్నారు. తేజ్ పూర్ యూనివర్సిటీ విద్యార్థుల స్నాతకోత్సవంలో ప్రధాని శుక్రవారం వర్చువల్ గా మాట్లాడారు.

మంచి ఫలితాలు సాధించాలంటే మంచి ఆలోచనలు ఉండాలని, అదే ఆత్మనిర్భర్ భారత్ కు చాలా అవసరం అని అన్నారు. ‘‘మన మైండ్ సెట్ మార్చుకోవడానికి మంచి ఉదాహరణ టీమిండియానే. మొదట్లో టీమ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మొదటి మ్యాచ్ లోనే దారుణంగా ఓడిపోయం. కానీ, దానితో కుంగిపోకుండా పోరాడాం. సవాళ్ల మధ్యే గెలుపును అందుకున్నాం. అనుభవం లేని టీమ్ తోనే సిరీస్ సాధించాం. చరిత్ర సృష్టించాం. ఆ గెలుపే మనందరికీ ఓ గొప్ప పాఠం. కాబట్టి మన ఆలోచనల్ని ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంచుకుందాం’’ అని సూచించారు.  

కరోనా మహమ్మారితో ఇండియా పోరును.. ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలుపుతో పోల్చారు. ప్రతి విషయంలోనూ మన చర్య ప్రతిచర్యల పరమార్థమే మారిపోయిందన్నారు. ఏం జరుగుతుందోనని మహమ్మారి మొదలైన మొదట్లో జనమంతా భయపడ్డారని, కానీ, యావత్ దేశం ఎంతో దృఢచిత్తాన్ని ప్రదర్శించిందని అన్నారు. కరోనా మహమ్మారికి దేశీయంగానే పరిష్కారాలు కనుగొన్నామని, వాటితోనే కరోనాపై పోరాడామని ఆయన గుర్తు చేశారు.

మన దేశంలో తయారైన వ్యాక్సిన్లే అందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఆగస్టు నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇప్పటి నుంచి అంతా ఓ నవ భారత నిర్మాణం కోసం బతకాలని, ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేయాలని అన్నారు. ఈ ఏడాది నుంచి వందో స్వాతంత్ర్య దినోత్సవం వరకు యువతదే బంగారు భవిత అని అన్నారు.

  • Loading...

More Telugu News