Joe Biden: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం.. వెయ్యిమంది అతిథుల హాజరు!

joe biden and kamala harris taken oath

  • 127 ఏళ్ల నాటి బైబిల్‌పై ప్రమాణం
  • అతి పెద్ద వయస్కుడిగా రికార్డు
  • రెండు బైబిళ్లపై ప్రమాణ స్వీకారం చేసిన కమలా హారిస్
  • క్యాపిటల్ హిల్ భవనం వద్ద 25 వేల మందితో భద్రత

అమెరికాలో బైడెన్ శకం ప్రారంభమైంది. అగ్రదేశం 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల జో బైడెన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఫలితంగా దేశ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. అలాగే, తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా 56 ఏళ్ల కమలా హారిస్ బాధ్యతలు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం కేపిటల్ హిల్ వెలుపల ఏర్పాటు చేసిన వేదిక వద్దకు భార్య జిల్‌తో కలిసి బైడెన్ చేరుకున్నారు.  

కమలా హారిస్ తన భర్త డగ్లస్ యెంహాఫ్‌తో కలిసి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. బైడెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. భార్యతో కలిసి తీసుకొచ్చిన 127 ఏళ్ల నాటి కుటుంబ బైబిల్‌పై ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆయన డెలవర్ సెనేటర్‌గా ఏడుసార్లు, ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఇదే బైబిల్‌ను ఉపయోగించారు.

అలాగే, కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం కోసం ఆమె రెండు బైబిళ్లను ఉపయోగించారు. అందులో ఒకటి స్నేహితురాలు రెజీనా షెల్టన్‌ది కాగా, రెండోది సుప్రీంకోర్టు తొలి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ థర్‌గుడ్ మార్షల్‌ది.

బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెయ్యిమంది మాత్రమే హాజరయ్యారు. మాజీ అధ్యక్షులైన బరాక్ ఒబామా-మిచెల్, బిల్ క్లింటన్-హిల్లరీ, జార్జ్ డబ్ల్యూ బుష్-లారా దంపతులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అల్లర్లు చోటుచేసుకునే అవకాశం ఉందన్న సమాచారంతో క్యాపిటల్ హిల్ పరిసరాల్లో 25 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతా సిబ్బందిలోని 12 మంది అనుమానితులను సేవల నుంచి తప్పించారు.

  • Loading...

More Telugu News