Pakistan: పాక్ ఉప ఎన్నికల్లో బిలావల్ భుట్టో పార్టీ విజయం.. ఇమ్రాన్‌పై పెరుగుతున్న ఒత్తిడి!
- బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ నేత విజయం
- విజేతను అభినందించిన భుట్టో, అసిఫ్ అలీ జర్దారీ
- ఈ నెల 31 లోగా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఇమ్రాన్‌పై ఒత్తిడి
ప్రతిపక్షాల నుంచి నిరసన సెగ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌లోని ఉమర్కోట్ ఉప ఎన్నికల్లో బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) విజయం సాధించినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పీపీపీ అభ్యర్థి అమీర్ అలీ షా తన సమీప ప్రత్యర్థి, గ్రాండ్ డెమొక్రటిక్ అలయన్స్ (జీడీఏ) నేత అర్బాబ్ గుల్హాన్ రహీం 30,921 ఓట్లు సాధించగా, అలీ షా 55,904 ఓట్లు సాధించినట్టు సమాచారం.
విజయం సాధించిన అలీషాకు పీపీపీ నేతలు బిలావల్ భుట్టో, అసిఫ్ అలీ జర్దారీలు అభినందనలు తెలిపారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన 11 ప్రతిపక్షాలు పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) పేరుతో పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా విజయం వారికి కొండంత బలాన్ని ఇచ్చినట్టు అయింది. జనవరి 31 లోగా పదవి నుంచి తప్పుకోవాలన్న ఒత్తిడి ఇమ్రాన్‌పై ఉందని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధికార ప్రతినిధి మరియమ్ ఔరంగజేబ్ చెప్పారు.