Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
- ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు కేంద్రం రూ. 789 కోట్లు ఖర్చు చేసింది
- రాష్ట్రం నుంచి రావాల్సిన రూ. 414 కోట్లు ఇంత వరకు రాలేదు
- ఈ నిధులను సత్వరమే విడుదల చేయండి
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎంఎంటీఎస్ విస్తరణ పనులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు. ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 789 కోట్లను ఖర్చు చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రావాల్సిన రూ. 414 కోట్లు ఇంత వరకు రాలేదని... దీంతో పనులు ఆగిపోయాయని లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు. పనులు జరగడంలో ఆలస్యమైతే ఖర్చు పెరిగిపోతుందని అన్నారు. ఇది ప్రాజెక్టుకు అదనపు భారంగా మారుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, సత్వరమే నిధులను విడుదల చేయాలని కోరారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ వెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని... ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.