King Richard Srinivasan: 37 దేశాలను చుట్టొచ్చిన బెంగళూరు బైకర్ దుర్మరణం.. ఒంటెను ఢీకొని మృతి
- రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం
- సెలబ్రిటీ బైకర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాస్ కన్నుమూత
- హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఒంటె
- అదుపు తప్పిన శ్రీనివాసన్
భారత్ కు చెందిన సెలబ్రిటీ బైకర్లలో అగ్రగణ్యుడిగా భావించే కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ అనూహ్యరీతిలో దుర్మరణం పాలయ్యాడు. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో ఆయన బైక్ ఓ ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది.
బెంగళూరుకు చెందిన ఈ స్టార్ బైకర్ ఇంతకుముందు మోటార్ సైకిల్ పై 5 ఖండాల్లో 37 దేశాలు చుట్టొచ్చాడు. బైక్ పై 65 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తాజాగా, బెంగళూరు నుంచి 8 వేల కిలోమీటర్ల యాత్రలో భాగంగా మిత్రులతో కలిసి జైసల్మేర్ చేరుకున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాసన్ బీఎండబ్ల్యూ జీఎస్ బైక్ పై ప్రయాణిస్తున్నాడు.
అయితే, ఫతేగఢ్ ప్రాంతంలో రోడ్డుపైకి అకస్మాత్తుగా ఓ ఒంటె రావడంతో శ్రీనివాసన్ తన బైకును అదుపు చేయలేకపోయాడు. ఒంటెను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన దెబ్బలు తగలడంతో మృతి చెందాడు. ముగ్గురు మిత్రులతో కలిసి యాత్రకు బయలుదేరిన శ్రీనివాసన్ ఈ నెల 23న తిరిగి బెంగళూరు చేరుకోవాల్సి ఉంది. కానీ, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. శ్రీనివాస్ కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
శ్రీనివాసన్ 2018లో బెంగళూరు నుంచి లండన్ కు బైక్ యాత్ర చేశాడు. ఆ మరుసటి ఏడాది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో యాత్ర సాగించాడు.