Pucovski: కెరీర్ లో తొలి టెస్టు ఆడాడు... అంతలోనే గాయం!
- గాయపడిన ఆసీస్ యువ ఆటగాడు పుకోవ్ స్కీ
- ఫీల్డింగ్ చేస్తుండగా కుడి భుజానికి గాయం
- రేపటి నుంచి బ్రిస్బేన్ లో చివరి టెస్టు
- మ్యాచ్ కు దూరమైన పుకోవ్ స్కీ
- పుకోవ్ స్కీ స్థానంలో మార్కస్ హారిస్ ఎంపిక
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా గాయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆతిథ్య ఆసీస్ జట్టుకు కూడా గాయాల బెడద తప్పలేదు. యువ ఓపెనర్ విల్ పుకోవ్ స్కీ గాయపడ్డాడు. ఇటీవల ముగిసిన సిడ్నీ టెస్టు ద్వారా ఈ ప్రతిభావంతుడైన క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అయితే, ఫీల్డింగ్ ప్రాక్టీసు చేస్తుండగా కుడి భుజం గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రేపటి నుంచి జరిగే చివరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. సిడ్నీ టెస్టులో పుకోవ్ స్కీ తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులు సాధించాడు.
కాగా, పుకోవ్ స్కీ స్థానంలో ఓపెనర్ గా మార్కస్ హారిస్ ను జట్టులోకి తీసుకున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియాలో చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో బ్రిస్బేన్ లో ఈ నెల 15న ప్రారంభమయ్యే చివరి టెస్టుపై మరింత ఆసక్తి పెరిగింది.