Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కడక్‌నాథ్ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ.. మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఆర్డర్ రద్దు
- రెండు వేల కోడి పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చిన ధోనీ
- రుడిపాండా ఫామ్‌లోని కోళ్లకు కరోనా
- 550 కోళ్లు, 2800 పిల్లలకు సోకిన హెచ్5 ఎన్1 వైరస్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యవసాయ క్షేత్రంలో కడక్‌నాథ్ కోళ్లను పెంచాలన్న నిర్ణయం వాయిదా పడింది. మధ్యప్రదేశ్, జబువా జిల్లా రుడిపాండాలోని కడక్‌నాథ్ కోళ్ల ఫాం నుంచి పిల్లలను తీసుకెళ్లి పెంచాలని ధోనీ నిర్ణయించాడు. అయితే, అక్కడి ఫాంలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సంక్రమించినట్టు పశుసంవర్థకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇక్కడి 550 కోళ్లు, 2,800 పిల్లలు హెచ్5ఎన్1 వైరస్ బారినపడినట్టు గుర్తించారు.
దీంతో కోడి పిల్లల కోసం ధోనీ ఇచ్చిన ఆర్డర్‌ను అధికారులు రద్దు చేశారు. గత నెలలో ధోనీ 2 వేల కోడి పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాడని, బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పుడా ఆర్డర్ రద్దయినట్టు పౌల్ట్రీ ఫాం యజమాని వినోద్ మేడా తెలిపారు. మరోవైపు, ఇక్కడి కోళ్ల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో పరీక్షించారు.
పరీక్షల్లో వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో వాటి మలమూత్రాలు, దాణా, గుడ్లను ధ్వంసం చేసి ఫాంలో క్రిమిసంహారక మందును స్ప్రే చేసినట్టు పశువైద్య విభాగం డైరెక్టర్ ఆర్కే రోక్డే తెలిపారు. ఫామ్ చుట్టుపక్కల కిలోమీటరు దూరాన్ని వైరస్ జోన్‌గా ప్రకటించారు. వ్యాధి బారినపడిన కోళ్లను గొయ్యి తీసి పాతిపెట్టనున్నట్టు వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అధిపతి కేఎస్ తోమర్ తెలిపారు.