Jagan: చదివించే స్తోమత లేక పిల్లల్ని కూలిపనులకు పంపడాన్ని పాదయాత్రలో చూశా... అందుకే అమ్మఒడి: రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- నెల్లూరు జిల్లాలో కార్యక్రమం
- చదువుకునే ప్రతి బిడ్డకు శ్రీరామరక్ష అంటూ సీఎం వ్యాఖ్యలు
- రెండో విడతలో రూ.6,673 కోట్లు విడుదల
- 44,48,865 మంది తల్లుల ఖాతాలో జమ
ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత చెల్లింపులను సీఎం జగన్ ప్రారంభించారు. ఇవాళ నెల్లూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ఇక్కడి వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రెండో విడత అమ్మఒడిలో భాగంగా రూ.6,673 కోట్లను విడుదల చేశారు. మొత్తం 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమచేశారు.
దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ.... తమ పిల్లలను చదివించే శక్తి లేక చాలా మంది తల్లులు వారిని కూలి పనులకు పంపడాన్ని పాదయాత్రలో చూశానని, అందుకే అమ్మఒడికి రూపకల్పన చేశామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15 వేలు ఇచ్చామని, ఇప్పుడు రెండో విడత అమలు చేస్తున్నామని వివరించారు. చదువుకోవాలనుకునే ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని సీఎం జగన్ అభివర్ణించారు. ఈ పథకంలో భాగంగా 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థికసాయం అందిస్తారు. .