JC Pawan Reddy: అఖిలప్రియ కేసు.. తెలంగాణ ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందన్న జేసీ పవన్
- కిడ్నాప్ కేసులో అరెస్టైన భూమా అఖిలప్రియ
- అరెస్ట్ పై అనుమానాలున్నాయన్న జేసీ పవన్
- దారుణంగా వ్యవహరించారని ఆరోపణ
హైదరాబాదులోని బోయిన్ పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్ పై కోర్టు ఈరోజు తీర్పును ఇవ్వనుంది.
మరోవైపు, అఖిలప్రియ అరెస్ట్ పై జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి జేసీ పవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ అరెస్ట్ పై తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం ఒక ఫిర్యాదు ఆధారంగా ఆమెను ఏ1గా పేర్కొని అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వంతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి అఖిలప్రియను అరెస్ట్ చేయించిందని పవన్ రెడ్డి ఆరోపించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ చర్యకు పాల్పడిందని అన్నారు.
పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని చెప్పారు. రైతు పక్షపాతినని చెప్పుకుని గద్దెనెక్కిన జగన్... రైతులను అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని అన్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్ని విధాలా విఫలమయ్యారని విమర్శించారు.