Narayanasamy: ఈ గవర్నర్ మాకొద్దు.... మూడో రోజుకు చేరిన పుదుచ్చేరి సీఎం దీక్ష
- కిరణ్ బేడీకి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి దీక్ష
- కిరణ్ బేడీ ప్రగతి నిరోధకురాలని వ్యాఖ్యలు
- రోడ్డుపైనే దీక్ష
- గవర్నర్ ను తొలగించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
పుదుచ్చేరిలో విచిత్ర రాజకీయం నెలకొంది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి దీక్షకు ఉపక్రమించారు. గవర్నర్ ను సాగనంపాలంటూ ఆయన చేపట్టిన దీక్ష నేటికి మూడో రోజుకు చేరుకుంది. గవర్నర్ గా కిరణ్ బేడీ మాకొద్దంటూ నారాయణస్వామి రోడ్డుపైనే దీక్షకు దిగారు. కిరణ్ బేడీ అధికారిక నివాసానికి సమీపంలోనే ఆయన దీక్ష చేపట్టారు.
కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ పుదుచ్చేరిలో అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కిరణ్ బేడీపై ఆరోపణలు చేస్తున్నారు. కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలగించాలని తాము 2019 డిసెంబరులోనూ ధర్నా నిర్వహించామని సీఎం నారాయణ స్వామి మీడియాకు తెలిపారు. తమ అసహనం ఇప్పుడు పతాకస్థాయికి చేరిందని, ఇప్పుడామె ఫైళ్లను తిప్పి పంపుతున్నారని, కేబినెట్ నిర్ణయాలను కొట్టివేస్తున్నారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ చేయాల్సిన పనులు ఇవి కావని, స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఆమెకు అధికారం లేదని స్పష్టం చేశారు.
పొంగల్ కానుకగా మేం ప్రజలకు రూ.1000 చొప్పున ఇవ్వాలనుకుంటే కిరణ్ బేడీ అందుకు అడ్డుపడ్డారని వెల్లడించారు. కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేందుకు అనుమతించారని తెలిపారు. అభివృద్ధి నిరోధకంగా మారారని, కిరణ్ బేడీని వెనక్కి పిలవాలంటూ ఈ క్రమంలో ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ప్రధాని నరేంద్రమోదీ, కిరణ్ బేడీ కలిసి పుదుచ్చేరిని తమిళనాడులో విలీనం చేసేందుకు కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.