Black Box: ఇండోనేషియా విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరికింది!
- జావా సముద్రంలో కుప్పకూలిన విమానం
- విమానంలో 62 మంది
- బ్లాక్ బాక్స్, వాయిస్ రికార్డర్ లను గుర్తించిన నిపుణులు
- డేటాను పరిశీలిస్తే ప్రమాద కారణాలు వెల్లడయ్యే అవకాశం
ఇండోనేషియాకు చెందిన ఓ బోయింగ్ విమానం థౌజండ్ ఐలాండ్స్ వద్ద జావా సముద్రంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఉన్న 62 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఈ విమానం బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది బ్లాక్ బాక్స్ ను గుర్తించారు.
బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లలో నిక్షిప్తమైన డేటాను పరిశీలిస్తే... విమానం ఎందుకు కూలిపోయింది? సాంకేతిక వైఫల్యంతో కుప్పకూలిందా? చివరి క్షణాల్లో కాక్ పిట్ లో ఉన్న పైలెట్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? అనే అంశాలు వెల్లడికానున్నాయి. ఇండోనేషియాకు చెందిన సిరివిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-500 విమానం రాజధాని జకార్తా నుంచి పాంటియానక్ వెళుతుండగా, టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.