Dr. Omar T. Atiq: వైద్యో నారాయణో హరి... తన పేషెంట్ల బిల్లులను మాఫీ చేసిన క్యాన్సర్ వైద్యుడు

US Doctor cancels his patients dues as goodwill gesture

  • ఆర్కాన్సాస్ లో క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించిన డాక్టర్ అతిఖ్
  • 30 ఏళ్లుగా రోగులకు సేవలు
  • ఇటీవల క్లినిక్ మూసేయాలని నిర్ణయం
  • రోగులు బకాయిలు పడినట్టు గుర్తించిన వైద్యుడు
  • బిల్లులు మాఫీ చేస్తూ అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ కానుక

వైద్యుడు భగవంతుడితో సమానం అని చెప్పడానికి వైద్యో నారాయణో హరి అనే సంస్కృత వాక్యాన్ని ఉదహరిస్తారు. అమెరికాలోని ఆర్కాన్సాస్ కు చెందిన డాక్టర్ ఒమర్ అతిఖ్ కు ఇది అతికినట్టు సరిపోతుంది. ఈ క్యాన్సర్ స్పెషలిస్టు ప్రాణాలు కాపడడమే కాదు, తనవద్ద గతంలో చికిత్స చేయించుకుని, లక్షల్లో ఉన్న ఆ బిల్లులు చెల్లించడానికి ఇప్పటికీ ఇబ్బందిపడుతున్న వారిపట్ల పెద్ద మనసు చూపించారు. వారి ఆసుపత్రి బిల్లులను మాఫీ చేసి వారికి క్రిస్మస్, నూతన సంవత్సర కానుక ఇచ్చారు. సుమారు 6.50 లక్షల డాలర్ల మేర రావాల్సిన బిల్లులను డాక్టర్ అతిఖ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన మాజీ పేషెంట్ల ముఖాల్లో మరింత వెలుగులు నింపారు.

ఆర్కాన్సాస్ ప్రాంతంలోని పైన్ బఫ్ ప్రాంతంలో 30 ఏళ్ల కిందట డాక్టర్ ఒమర్ అతిఖ్ క్యాన్సర్ క్లినిక్ నెలకొల్పారు. మొదటి నుంచి సేవాభావంతో వైద్యచికిత్స అందించిన ఈ వైద్యుడు ఏనాడూ ఆర్థిక కారణాలతో రోగులకు చికిత్స నిరాకరించలేదు. తమ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని రోగులు నమ్మకం వ్యక్తం చేయడాన్ని తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాను అని అతిఖ్ వెల్లడించారు.

అయితే ఇప్పటివరకు తాను రోగుల చికిత్సలోనే మునిగితేలానని, బిల్లుల వ్యవహారం ఆసుపత్రి సిబ్బంది చూసుకునేవారని వెల్లడించారు. ఆయన ఇటీవల తన క్లినిక్ ను మూసేసి బోధన రంగంలో ప్రవేశించాలనుకుంటున్నారు. అందుకే తన క్లినిక్ కు సంబంధించిన లెక్కలు చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది పేషెంట్లు బిల్లులు చెల్లించలేక, కొద్దిపాటి మొత్తాలను మాత్రమే చెల్లించడం ఆయన దృష్టికి వచ్చింది. దాంతో అలాంటి వాళ్లను గుర్తించి వారి బిల్లులు మొత్తాన్ని మాఫీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన చర్యతో వాళ్ల జీవితాలు సాఫీగా సాగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. పాకిస్థాన్ నుంచి అమెరికా వలస వచ్చిన డాక్టర్ అతిఖ్ కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

  • Loading...

More Telugu News