: టి20 క్రికెట్లో తిరుగులేని వీరుడు!
బ్రాడ్ హాడ్జ్.. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి పరిచయస్తుడే అయినా, బుధవారం రాత్రి ఢిల్లీలో సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా హీరోగా అవతరించాడు. ఓటమి దిశగా పయనిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. దీంతో, రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని అధిగమించింది. ఒత్తిడి సమయాల్లో సైతం చాపకింద నీరులా పని పూర్తి చేసే హాడ్జ్.. సన్ రైజర్స్ బౌలర్ల పాలిట విలన్ లా పరిణమించాడు. సామి విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస సిక్స్ లతో కెప్టెన్ ద్రావిడ్ మోములో నవ్వులు పూయించాడు.
హాడ్జ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. టి20 క్రికెట్లో మాత్రం ఈ ఆసీస్ క్రికెటర్ తిరుగులేని వీరుడే. ఈ మినీ ఫార్మాట్లో 195 మ్యాచ్ లాడిన హాడ్జ్ 5548 పరుగులు చేశాడు. మరెవ్వరూ కూడా టీ20 పరుగుల విషయంలో ఈ కంగారూ యోధుడికి దరిదాపుల్లో లేరు. వాటిలో 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక స్ట్రయిక్ రేట్ (129.74) చూస్తే వందకు పైమాటే. బౌలింగ్ లోనూ ఉపయుక్తంగా ఉండే హాడ్జ్ 62 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ జనాకర్షక ఫార్మాట్లో కంగారూ కింగ్ ఎంత ఫేమస్ అంటే.. అతను ప్రాతినిధ్యం వహించే జట్ల జాబితానే ఆ విషయాన్ని చెబుతుంది.
ప్రధానంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా జట్టుకు ఆడే హాడ్జ్.. రాజస్థాన్ రాయల్స్, ఆక్లాండ్, బారిసాల్ బర్నర్స్, లీసెస్టర్ షైర్, మెల్ బోర్న్ రెనెగేడ్స్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్లకూ తన బ్యాటింగ్ వెలుగులు పంచుతున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హాడ్జ్.. గత ఐపీఎల్ సీజన్లలో కోల్ కతా నైట్ రైడర్స్, కోచి టస్కర్స్ కేరళ జట్లకు ఆడిన సంగతి తెలిసిందే.